మమతా బెనర్జీకి భారీ షాక్... విపక్ష నేత ఛాంబర్ తాళాలు రితవ్రతకు అందించిన స్పీకర్!

  • బెంగాల్ టీఎంసీలో తారాస్థాయికి చేరిన సంక్షోభం
  • ప్రతిపక్ష హోదా తమదేనన్న రెబల్ వర్గం
  • 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటన
  • రితవ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించారని వెల్లడి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత రితవ్రత బెనర్జీ, తమ వర్గాన్నే ప్రధాన ప్రతిపక్షంగా స్పీకర్ గుర్తించారని, తనకు ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) హోదా కల్పించారని ప్రకటించారు. గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీకి ఇది మరో గట్టి ఎదురుదెబ్బగా మారింది.

బుధవారం సుమారు 58 నుంచి 60 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో రితవ్రత అసెంబ్లీకి చేరుకున్నారు. తమ వర్గానికి ప్రతిపక్ష హోదా కట్టబెట్టాలని కోరుతూ స్పీకర్ రతీంద్రనాథ్ బోస్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తమదే అసలైన, ప్రధాన ప్రతిపక్షమని రితవ్రత స్పష్టం చేశారు. స్పీకర్ తమ ప్రతిపాదనను అంగీకరించి, ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని తనకు కేటాయించారని, విపక్షనేత ఛాంబర్ తాళాలు తనకు అప్పగించారని ఆయన తెలిపారు.

గత నెలలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించడం, సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం టీఎంసీలో అసమ్మతి పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో జూన్ 1న రితవ్రతతో పాటు మరో ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించారు.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని టీఎంసీ రెబల్ వర్గం చెబుతోంది. అయితేచ తాము మమతా బెనర్జీకి విధేయులమేనని, ఇది పార్టీలో చీలిక కాదని, 'అసలైన టీఎంసీ'ని తామేనని వారు పేర్కొంటున్నారు. ఈ కీలక పరిణామంపై స్పీకర్ కార్యాలయం నుంచి గానీ, టీఎంసీ అధిష్ఠానం నుంచి గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Expelled TMC MLA Ritabrata Banerjee becomes LoP
West Bengal politics

More Telugu News